About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

05 September 2023


 ఉపాధ్యాయుని తోనే ఉత్తమ బోధనభ్యసన

పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లు వద్దని యునెస్కో రిపోర్టు సూచిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌ లోని పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లను తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయులకు బదులుగా సాంకేతికతను ఉపయోగించడం సరైనది కాదు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, నాణ్యమైన ఉపాధ్యాయ వర్గాన్ని అందించడం ద్వారా బోధనాభ్యసన మెరుగుపడాలి. సాంకేతిక పరికరాలు ఉపాధ్యాయులకు సహాయకారిగా మాత్రమే ఉండాలనే యునెస్కో సూచనలను పరిగణన లోకి తీసుకుని భవిష్యత్‌ విద్యారంగ ప్రణాళికలు రూపొందించాలి.

            విద్యారంగంలో సాంకేతికత కోవిడ్‌ కాలంలో విస్తృతంగా ఉపయోగించబడింది. ఆ సమయంలో విద్యారంగం దెబ్బతినకుండా డిజిటల్‌ విధానం ఆదుకుంది. కానీ ఆధునిక సాంకేతికత అందుబాటులో లేక కోట్లాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రపంచవాప్తంగా పరిస్థితులు మెరుగుపడ్డాక కూడా సాంకేతికతను ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో 14 దేశాలలో చదువులపై సాంకేతిక రంగ ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో ఇటీవల 'గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌-2023'ను విడుదల చేసింది. ఈ సందర్భంగా యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రే అజూలే స్పందిస్తూ- ఏ సాంకేతిక సాధనం కూడా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదు. విద్యార్థుల అభ్యసనానికి సాంకేతిక సాధనాలు అదనపు వనరులుగా మాత్రమే ఉండాలి. అది విద్యాభ్యసన మెరుగుదలకు ఉపయోగపడేలా ఉండాలి. నేటి తరం విద్యార్థికి సాంకేతికత లేకపోయినప్పటికీ జీవించడమెలాగో నేర్పించాలి-అని కోరారు. ఈ అధ్యయనంలో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్‌ విద్యా ప్రణాళికలను ప్రకటించాలని ప్రపంచ దేశాలలోని విద్యారంగ నిపుణులు, విద్యా ప్రణాళికా రచయితలను కోరారు.
               స్మార్ట్‌ఫోన్ల ద్వారా విద్యాబోధన వలన లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. విద్యార్థి కేంద్రంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలి. డిజిటల్‌ పరికరాల అతి వినియోగం వలన విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుని అతిగా స్పందించడం పెరిగింది. డేటా సురక్షితం కాకపోవడంతో సైబర్‌ నేరాలు పెరిగాయి. విద్యార్థులలో ఏకాగ్రత, స్థిరంగా ఆలోచించే తత్వం దెబ్బ తింటుంది. విద్యార్థులలో డిజిటల్‌ అసమానతలు పెరిగిపోతున్నాయి. డిజిటల్‌ విద్యా వనరులు అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. 31 శాతం మందికి కనీసం డిజిటల్‌ విద్య అందుబాటులో లేదు. విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య ఉండాల్సిన కనీస కమ్యూనికేషన్‌ కూడా దిగజారిపోతుంది. దీనిని నిలువరించని పక్షంలో భవిష్యత్తులో అతిగా సాంకేతికతను ఉపయోగించే విద్యార్థి, సృజనాత్మక ఆలోచనలు కోల్పోయి, నిత్య జీవితంలో యాంత్రికంగా మారిపోయే దుస్థితి ఉంది...అంటూ యునెస్కో నివేదిక పలు హెచ్చరికలు కూడా చేసింది.
             యునెస్కో నివేదిక కొన్ని సిఫార్సులను సైతం చేసింది- ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకునే సందర్భంలో వాణిజ్య ప్రయోజనాలతో పాటు సామాజిక లాభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. స్వల్పకాలిక ప్రయోజనాల కంటే, దీర్ఘకాలిక నష్టాలను లెక్కవేయాలి. డిజిటల్‌ విధానాన్ని ఉపయోగించే సందర్భంలో విద్యార్థుల, ఉపాధ్యాయల వ్యక్తిగత డేటా గోప్యత, భద్రతకు చట్టాలు చేయాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా జాగ్రత్త పడాలి. విద్యారంగంలో సాంకేతికతను విద్యార్థుల అభ్యసన మెరుగుపడేందుకు ఉపయోగించాలి. ఉపాధ్యాయులకు డిజిటల్‌ సాంకేతికత సహకారిగా మాత్రమే ఉండాలి. ఉపాధ్యాయలకు ప్రత్యామ్నాయంగా మారకుండా జాగ్రత్తపడాలి. తరగతిలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించివేయాలని సూచించింది.
 

                                                                    బోధనలో సాంకేతిక సరైనదేనా ?

డిజిటల్‌ విద్యా విధానం వలన చదువులు మెరుగు పడ్డాయని చెప్పడానికి నేటికీ బలమైన అధ్యయనం లేదు. విద్యార్థులలో ఆలోచనాశక్తిని కట్టడి చేసే విధానంగా సాంకేతికత నిలుస్తుంది. సృజనాత్మకతను కోల్పోయేట్టు చేస్తుంది. లెర్నింగ్‌ బై డూయింగ్‌కు ఇది పూర్తి విరుద్ధం.
 

                                                                అందరికీ సమానంగా అందుతుందా ?

డిజిటల్‌ సాంకేతిక పరికరాలు అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. పైగా ఇవి ప్రతి 36 నెలలకు అప్‌గ్రేడ్‌ కావడమో లేదా కొత్తవి రావడమో జరుగుతుంది. ఈ క్రమంలో డిజిటల్‌ విద్య కొందరికే అందుబాటులో ఉంటున్న సంగతి కోవిడ్‌-19 కాలంలో మన అనుభవంలోకి వచ్చిందే.
 

                                                డిజిటల్‌ విద్యా విధానంలో బోధనాభ్యసనాన్ని కొలవగలమా ?

సాంకేతిక రంగంలో అభ్యాస ప్రక్రియ (లెర్నింగ్‌ ప్రాసెస్‌) ఒకవైపు నుంచే ఉంటుంది. రెండవ వైపు స్థబ్దుగా ఉండటం వలన లెర్నింగ్‌ ప్రాసెస్‌ను సాంకేతిక పరంగానే అంచనా వేయగలం. అంతేగానీ పూర్తి స్థాయి అంచనా వేయలేం. నాణ్యతను అంచనా వేయలేం.
 

                                                                   సుదీర్ఘకాలం నిలబడగలిగేనా ?

విద్యా రంగంలో సాంకేతికతను ఉపయోగించడం వలన విద్యాభ్యసనం సుదీర్ఘకాలం నిలబడుతుందని చెప్పగలిగే అధ్యయనాలు నేటికీ అందుబాటులో లేవు. సాంకేతికతో వ్యక్తిగత వెసులుబాటు బాగున్నా సామాజికంగా అది కలిగించే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని విద్యావిధాన నిర్ణయాలు తీసుకోవాలని యునెస్కో నివేదిక ప్రపంచ దేశాలకు సూచించింది. గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌-2023 సూచనలను తక్షణమే అమలు చేయడానికి ఫ్రాన్స్‌, ఫిన్లాండ్‌, నెదర్లాండ్స్‌ దేశాలు అంగీకరించడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. చైనాలో ఇప్పటికే బోధనలో సాంకేతికతను 30 శాతం మించకుండా కట్టడి చేయడం జరిగింది. మిగిలిన ప్రపంచ దేశాలు ఆ దిశగా ముందడుగు వేస్తాయని ఆశిద్దాం. ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా విద్యారంగంలో సాంకేతికత బోధన మెరుగుదలకు మాత్రమే ఉపయోగపడాలి. దీనితోపాటు ఆన్‌లైన్‌ విద్య అనేది బోధనలో అభ్యసనలో అదనపు వనరుగా వుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలుగా విద్యారంగంలో సాంకేతికతకు పెద్ద పీట వేయడం చూస్తున్నాం. దీనికంటే రెండు సంవత్సరాల ముందు నుంచే యాప్‌ల పేరుతో నిరంతరం పాఠశాల, ఉపాధ్యాయుల, విద్యార్థుల సమాచార సేకరణ జరుగుతున్నది. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు, విద్యార్థుల మార్కుల నమోదు చేయాల్సి వుంటోంది. ఇవిగాక పాఠశాలలో టాయిలెట్లు, గుడ్డు, చిక్కీ, బియ్యం వంటి నిరంతర రోజువారీ అంశాలను ఉపాధ్యాయులే నమోదు చేయాల్సి వస్తున్నది. వీటివలన ప్రాథమిక పాఠశాలల్లో విలువైన బోధనా సమయాన్ని కోల్పోతున్నాం.
             మూడవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు టోఫెల్‌ ప్రోగ్రామ్‌, అదే విధంగా ఐఎఫ్‌పి (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌)ను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అమలుకు తెచ్చారు. దేశం మొత్తం మీద పాఠశాలల్లో 25,000 ఐఎఫ్‌పిలు వాడుకలో వున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లోనే 15,694 పాఠశాలల్లోని 30,230 క్లాస్‌రూములకు ఐఎఫ్‌పిలను అందించారు. అదే విధంగా 3, 4, 5 తరగతులకు స్మార్ట్‌ టీవీలు అందించారు. ఎ.పి ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడం జరిగింది.
ఈ ఐఎఫ్‌పిల వినియోగానికి సంబంధించి రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి జులై మొదటి వారంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఐఎఫ్‌పిలకు బైజూస్‌ కంటెంట్‌ను జోడించి విద్యార్ధులకు పాఠ్యాంశాలను బోధించాలని శిక్షణా సమయంలో చెప్పారు. తరగతి గదిలో ఐఎఫ్‌పిల ద్వారా బోధన వల్ల ఉపాధ్యాయులు పాసివ్‌గా ఉండేే పరిస్థితి ఏర్పడుతుంది. రోజులో ఎక్కువ భాగం ఐఎఫ్‌పిలను విద్యార్ధి చూడటం వలన మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్‌ క్రమేపీ తరుగుతుంది. దీనికి తోడు కొంతమంది ఉపాధ్యాయులు టెక్నాలజీ సమర్ధవంతంగా ఉపయోగించలేక పోవచ్చు. విద్యార్థులు అతిగా స్క్రీన్‌లను చూడటం వలన కంటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది.
            గత అయిదు సంవత్సరాలుగా ఒక డిఎస్‌సి నోటిఫికేషన్‌ వేయలేదు. పైగా ప్రభుత్వం జీవో 117 ద్వారా పాఠశాలల విలీనం చేసింది. దీనివలన రాష్ట్రంలోని 3 జిల్లాలలో తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా వున్నట్టు కన్పించసాగాయి. నాణ్యమైన ఉపాధ్యాయుల నియామకం చేయకుండా ఉన్నత పాఠశాలల్లో టిపిఆర్‌ను పెంచి ఉపాధ్యాయులపై తీవ్రమైన భారం పెంచడం, పర్యవేక్షణలతో ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం విద్యా రంగానికి మంచిది కాదు.
             పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లు వద్దని యునెస్కో రిపోర్టు సూచిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌ లోని పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లను తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయులకు బదులుగా సాంకేతికతను ఉపయోగించడం సరైనది కాదు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, నాణ్యమైన ఉపాధ్యాయ వర్గాన్ని అందించడం ద్వారా బోధనాభ్యసన మెరుగుపడాలి. సాంకేతిక పరికరాలు ఉపాధ్యాయులకు సహాయకారిగా మాత్రమే ఉండాలనే యునెస్కో సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్‌ విద్యారంగ ప్రణాళికలు రూపొందించాలి.

/ వ్యాసకర్త ˜యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి,
సెల్‌ : 9490762412 /
ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌