About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

22 February 2023


                                  ఉపాధ్యాయులు లేకుండా నాణ్యమైన విద్యా ఎలా?


విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్ధాయి కంటే మెరుగ్గా ఉన్నట్లు ఇటీవల విడుదలైన 'అసర్‌ నివేదిక-2022' తెలియజేసింది. పూర్వ ప్రాథమిక స్కూళ్లలో జాతీయ సగటుకు మించి ఎ.పి లో చిన్నారుల చేరిక వుండటం, బాలికల డ్రాపౌట్లు అతి తక్కువగా ఉండటం, ఆంగ్లం సామర్థ్యంలో జాతీయ సగటుకు మించి ఫలితాలుండడం మనం గమనించవచ్చు. జాతీయ సగటును మించి వున్నాం కదా అని సంతోషించేలోగా...ప్రైవేటు ట్యూషన్లకు డిమాండ్‌ పెరగడం కూడా నివేదికలో కన్పిస్తుంది. పైగా అభ్యసనా సామర్ధ్యం తీవ్రంగా ప్రభావితమైందని ఈ నివేదిక తెలియజేసింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు మూతపడడంతో అభ్యసనంలో గతంలో సాధించిన మెరుగుదల కూడా దెబ్బతిన్నట్టు నివేదిక పేర్కొంది. బాల బాలికల అభ్యసనా సామర్ధ్యం చదవడంలోనూ, గణితం (కూడిక, తీసివేత, గుణించడం, భాగించడం)లోనూ 2012 స్థాయికి దిగజారింది. కచ్చితంగా ఒక దశాబ్ద కాలంపాటు వెనక్కు పోయామంటే కరోనా మహమ్మారి దెబ్బ తీవ్రత ఎంతలా వుందో విశదమవుతోంది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎన్ని అతిశయోక్తులు చెప్పినా, ఈ ప్రమాణాలు, ప్రాతిపదికలు, గణాంకాలు శాస్త్రీయంగా, హేతుబద్దంగా ఆ సమాజ స్థితిని నిర్ధారిస్తాయి. సమాజంలో విద్యారంగం ఎలా ఉందనేది అటువంటి ప్రమాణాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ లోనూ అభ్యసన సామర్ధ్యాలు 2012 సంవత్సరం స్ధాయికి పడిపోవడాన్ని నివేదిక స్పష్టం చేసింది.
           ప్రభుత్వం మాత్రం వినూత్న పథకాలతో విద్యావిప్లవం వచ్చిందని గొప్పగా ప్రకటించడం మనం చూస్తున్నాం. విద్యా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్‌ వివరాలను, విద్యార్థులకు అందజేసిన సంక్షేమ పథకాలను, వాటి వల్ల బడిలో చేరిన పిల్లల గూర్చి, మన బడి, నాడు-నేడు పథకంతో పాఠశాలల కార్పొరేట్‌ రూపాన్ని...గణాంకాలతో సహా ఆర్భాటంగా చెప్తారు. కానీ ఉపాధ్యాయుల నియామకాల గురించి మాత్రం స్పందించరు. ప్రతి సంవత్సరం డియస్సీ నిర్వహిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయరు. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచిపోయినా, ఇప్పటికీ మెగా డియస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. భారత పార్లమెంట్‌లో ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 50,677 టీచర్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. పైగా ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటు చేసి, జీవో 117, 124 లను అనుసరించి పాఠశాలలను విలీనం చేసి పాఠశాలల సంఖ్యను కుదించడం వేగంగా జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో డియస్సీ నియామకాలు జరిగి సుమారు 5 సంవత్సరాలు అయ్యింది. 2018లో అప్పటి ప్రభుత్వం 7000 పోస్టులతో నిర్వహించింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విలీనం పేరుతో పాఠశాలల కుదింపు, ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తిని పెంచడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తగ్గించింది. గత ప్రభుత్వాల కాలంలో 1996, 1998, 1999, 2000, 2001, 2002,2002 2003 2006  2018 సంవత్సరాలలో వరుసగా డియస్సీలు నిర్వహించి లక్షా నలభై అయిదు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. అంటే ఇప్పుడు సర్వీసులో ఉన్న 70 శాతం మంది ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో నియమింపబడినవారే. ఈ ప్రభుత్వ హయాంలో ఈ నాటికీ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ కాలేదంటే వీరి చిత్తశుద్ధిని శంకించాల్సిందే.
విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకం అమలు చేయడం, జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, స్కూలు బ్యాగ్‌, పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌ పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్టు, ఇంగ్లీషు డిక్షనరీ, ఈ సంవత్సరం ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వడం, జగనన్న గోరుముద్ద నిజంగా విద్యార్థుల పాలిట వరం లాంటివే. పాఠశాల రూపురేఖల్ని మార్చడం, అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పన నిజంగా మెచ్చుకోదగినవే. కానీ విద్య కోసం బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే మాత్రం ఎక్కడో వుంటాం. ఢిల్లీ ప్రభుత్వం 2022-2023 సంత్సరానికి తమ బడ్జెట్‌లో 23.50 శాతం కేటాయించి ప్రథమ స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 12.70 శాతం కేటాయించి 21వ స్థానంలో ఉంది. బడ్జెట్‌ కేటాయింపుల పరంగా చూస్తే మన ప్రభుత్వం విద్యారంగానికి ఎంత తక్కువ కేటాయించిందో మనం గమనించవచ్చు. రూ. వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలకు తగిన సౌకర్యాలు కల్పించి నూతన హంగులు సమకూర్చినప్పటికీ విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులను నియమించకపోతే విద్యా నాణ్యత పెరిగేనా? విద్యా విప్లవం వచ్చేనా ?
           కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం-2022ను దేశంలోనే అత్యుత్సాహంతో మొట్టమొదట అమలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. తరగతుల విలీనంతో గ్రామగ్రామాన ప్రాథమిక పాఠశాలలు అల్లకల్లోలమయ్యాయి. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేసిన ప్రభుత్వం, మళ్ళీ పది మందికన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలల విలీనానికి పూనుకున్నది. ఉపాధ్యాయులకు అనవసరమైన పనులు అప్పగించడం ద్వారా వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తున్నది. పిఆర్‌సి ఆందోళన తర్వాత ఉపాధ్యాయులపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా సొంత ఫోన్ల ద్వారా అటెండెన్స్‌ వేయడం, బాత్‌రూముల ఫోటోలు అప్‌లోడ్‌ చేయడం, మధ్యాహ్న భోజనం పదార్ధాలు అలాగే భోజనం చేస్తున్న విద్యార్థుల ఫోటోలు అప్‌లోడ్‌ చేయడం, మార్కులు ఆన్‌లైన్‌ చేయడం వంటివి బోధనా సమయాన్ని హరించేవే. దీనికి తోడు ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేయడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల విలీనం, ఉపాధ్యాయ పోస్టుల కుదింపుల విషయంలో పునరాలోచించడం అవసరం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందడుగు వేయాలి. ఎన్నికలకు ముందు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేయడం కాకుండా...వెంటనే డియస్సీ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ప్రకటించాలి. విద్యార్థులకు తగినంతమంది ఉపాధ్యాయులు లేకుండా విద్యారంగంలో సంస్కరణలు సాధ్యం కావని, సఫలీకృతం కావని ప్రభుత్వం గుర్తించాలి.

/వ్యాసకర్త : ఎ.పి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి,
సెల్‌ : 9490762412/
ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌