About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

03 March 2025


                                                       https://prajasakti.com/features/conquer


ఒత్తిడి వద్దే వద్దు…’పది’ని జయించు

Mar 4,2025 05:59

నూతన సిబిఎస్‌సి సిలబస్‌తో పదో తరగతి పరీక్షలు మొదటి సారిగా మన రాష్ట్రంలో ఈనెల 17 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురౌతుంటారు. ఇది ఏమాత్రం సరికాదు. ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. తద్వారానే పరీక్షల్లో మంచిగా పరీక్షలు రాసి తద్వారా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఏడాదిపాటు చదివిన అంశాలే కాబట్ట్టి అన్ని ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలను చదువుకుంటూ వెళ్లటం ఉత్తమం. తద్వారా గతంలో చదివిన విషయాలను మళ్లీ ఒకసారి గమనంలోకి తెచుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పిల్లలూ ఎవ్వరూ ఒత్తిడికి గురికావద్దు. ప్రణాళికాబద్ధంగా కషిచేస్తే మంచి మార్కులతో విజయం సాధించటం సులభమే అవుతుంది. ఏడాదిలో కష్టపడి చదివింది ఎలాంటి తప్పిదాలకు తావీయకుండా 3.15 గంటల సమయంలో (పిఎస్‌, ఎన్‌ఎస్‌ పరీక్షలు 2 గంటలు మాత్రమే) పరీక్షల్లో సమర్థవంతంగా రాయగలిగినప్పుడే చక్కని ఫలితం చేజిక్కుతుంది. చిన్న తప్పిదాల కారణంగా ప్రతిభావంతులు సైతం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం కోల్పోతుంటారు.

జవాబులు ఇలా రాయాలి

ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు విద్యార్థుల పరిశీలన, విశ్లేషణ, అవగాహన శక్తిని వెలికితీసేలా ఉంటాయి. అందుకే ప్రశ్నాపత్రాన్ని చదవడానికే పావుగంట సమయం ఇచ్చారు. సుమారు 75శాతం మంది ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న 5 నిమిషాల్లోనే జవాబులు రాయటం మొదలెడుతున్నారు. ఇది సరికాదు. ముందుగా ప్రశ్నలను బాగా చదవాకే సమాధానాలు రాయటం ప్రారంభించాలి. సమాధాన పత్రాలతో కూడిన బుక్‌లెట్‌ ఇవ్వగానే ముందుగా ప్రతి పేజీకి ఎడమవైపు 2-2.5సెంటీమీటర్లు ఉండేలా మార్జిన్‌ వదలాలి.
తెలుగులో మూడు భాగాలుంటాయి. మొదటి భాగంలో 32 మార్కులు సులభంగా సాధించొచ్చు. వీటిలో పరిచిత పద్యాలు 21 ఉన్నాయి. వీటిలో 8 సాధన చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు. పద్య భాగంలో కవి పరిచయం, గద్యంలో ప్రక్రియలు, లేఖ, కరపత్రం అంశాలు, ఛందస్సులో వృత్తపద్యాలపై ప్రశ్నలొస్తాయి. మారీచుడు, కైక, విశ్వామిత్రుడు, సుగ్రీవుడు, దశరధుడు వంటి అంశాలతోపాటు రామాయణం ప్రాశస్త్యం, తదితర అంశాలపై పట్టుసాధిస్తే మంచి మార్కులు సాధించొచ్చు.

హిందీ సబ్జెక్ట్‌లో తొలుత ప్రశ్నావళిని అవగాహన చేసుకొని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్‌-1లో 12 ప్రశ్నలు వ్యాకరణానికి సంబంధించినవి ఉంటాయి. పేరాగ్రాఫ్‌ పాసేజ్‌ చక్కగా చదివి జవాబులు రాయాలి. 13,14,15,16 ప్రశ్నల్లో కీలక పదాన్ని గుర్తించి సమాధానాన్ని తేలికగా వెదికి జవాబు రాయాలి. 17 ప్రశ్న కబీర్‌, మైథిలి, శరణగుప్తలో కవి పరిచయం వస్తుంది. 19వ ప్రశ్న సాఖీ పాఠంలోని 4 దోహాలలో ఒకటి తప్పనిసరిగా వస్తుంది. వీటిని జాగ్రత్త చదవడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు.
ఇంగ్లీషు ప్రశ్నాపత్రంలో మొత్తం మూడుసెక్షన్లు ఉంటాయి. ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు క్షుణ్నంగా చదివి జవాబులు రాయాలి. కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌లో ప్రశ్నలకు ఇచ్చిన టెక్ట్స్‌లోనే సమాధానాలు ఉంటాయి. దీంతో సులభంగానే 30 మార్కులు సాధించొచ్చు. సెక్షన్‌ బిలో గ్రామర్‌ అండ్‌ ఒకాబులరీలో యాక్టివ్‌ వాయిస్‌, ప్యాసివ్‌ వాయిస్‌, ప్రిపోజిషన్స్‌, డిక్షనరీ ఎంట్రీ, స్పెల్లింగ్‌ టెస్ట్‌, సిఫిక్స్‌-ప్రిఫిక్స్‌ వంటివి తేలికగా జవాబులు రాయొచ్చు. సెక్షన్‌ సిలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్‌ సొంతంగా రాయడం ద్వారా మంచి మార్కులు సాధించొచ్చు. సమాధానాలన్నీ ఒకేచోట క్రోనాజికల్‌ ఆర్డర్‌లో రాయాలి.

గణితశాస్త్రంలో మార్కుల సాధన సులభం. సంభావ్యత బహుపదులు, వాస్తవ సంఖ్యలు, నిరూపక రేఖాగణితం అధ్యాయాలపై ప్రత్యేక ప్రాక్టీసు చేయాలి. నిరూపక జామితి పాఠ్యాంశం నుంచి సెక్షన్‌ నాలుగు లేదా ఎనిమిది మార్కులకు, సాంఖ్యకశాస్త్రంలోని మీన్‌, మోడ్‌, మీడియన్‌లపై తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది. గ్రాఫ్‌పై సాధన చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు.

భౌతిక రసాయన శాస్త్రంలో 50/50 మార్కులు సాధించొచ్చు. ఎన్సీఆర్టీ వారు అందించిన స్టడీమెటీరియల్‌ను సాధన చేయడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు. లోహాలు, అలోహాలు పాఠం నుంచి ప్రయోగం నేర్చుకుంటే సులభంగా ఎనిమిది మార్కులు పొందొచ్చు. మయోపియా, హైపర్‌ మెట్రోపియా దృష్టి లోపాలు, వాటిని సవరించే విధానం నేర్చుకోవాలి. ఇంద్రథనుస్సు ఏర్పడే విధానం కాంతి పరిక్షేపణ వంటి ప్రశ్నలు ప్రశ్నలు బాగా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి. బొమ్మలు గీసేటపుడు స్పష్టతతో ఉంటే మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. భౌతికశాస్త్రంలోని సమస్యల (ప్రాబ్లెమ్స్‌)లో ప్రమాణాలను రాయడం మరిచిపోరాదు. ఉధాహరణకు సెంటీ మీటరు, గ్రాము, జౌలు, వాట్స్‌ తదితరాలు. జీవశాస్త్రంలో ప్రయోగాలకు చెందిన జవాబులను రాసేటప్పుడు సంబంధిత బమ్మలను కూడా తప్పక వేయాలి. గణితంలో ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలు రివిజన్‌ చేయాలి. టెక్ట్స్‌బుక్‌ చాప్టర్‌ చివరలో ఉండే సమస్యలను మరొక్కసారి రివిజన్‌ చేసుకోవాలి.

సాంఘిక శాస్త్రంలోని మ్యాప్‌ పాయింట్‌కు మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. పైచార్టు, మ్యాప్‌ రీడింగ్‌ ప్రశ్నలను తప్పనినరిగా రాయాలి. సమకాలీన అంశాల్లో మూస ధోరణులకు ప్రాధాన్యం తగ్గించి, సొంత అవగాహనతో నిత్య జీవిత ఉదాహరణలు అన్వయిస్తూ రాయాలి. ఎన్సీయారిటీ వారు ఇచ్చిన ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్‌ చేయాలి.సమాచార నైపుణ్యాలపై ఆర్ధశాస్త్రంలోని మొదటి మూడు పాఠాలలోని సమాచార పట్టికలు, బార్‌గ్రాఫ్‌ను అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు.
ప్రశ్నాపత్రంలో బాగా వచ్చిన ఏ ప్రశ్నకైనా ముందుగా జవాబు రాయొచ్చు. ఆ ప్రశ్న నంబరును ఎడమవైపు మార్జిన్‌లో తప్పక వేయాలి. ప్రశ్నల నంబర్లు తప్పుగా వేయడం, మరిచిపోవడం చేసేవారు 1శాతం వరకూ ఉంటారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

  • ఒత్తిడికి గురికాకూడదు.
  •  తక్కువ సమయంలో రివిజన్‌ చేసుకోవాలి
  •  కొత్త అంశాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి
  •  ఆహారం, నిద్ర, వ్యాయామానికి తగినంత సమయాన్ని కేటాయించాలి
  •  ఎన్టీఆర్టీ ప్రశ్నలనిధి. మాదిరి పశ్న్రా పత్రాలు ప్రాక్టీస్‌ చేయాలి
  •  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
  •  సెల్‌ఫోన్‌, టివి, కంప్యూటర్లకు దూరంగా ఉండాలి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఎర్ర సిరా ఉండే (బాల్‌)పెన్ను వాడకూడదు.
  • నీలం బ్లూ, నలుపు సిరా ఉండే వాటినే ఉపయోగించాలి.
  •  పెద్ద అక్షరాలతో, మరీ ఎక్కువ మార్జిన్‌ వదిలి భారీగా పేజీలు నింపడం వల్ల ప్రయోజనం శూన్యం.
  •  ప్రతి పుటకు 20-25 వాక్యాలు రాస్తే మేలు.
  •  జవాబులను వ్యాసంలా కాక బుల్లెట్‌ పాయింట్ల రూపంలో రాయాలి.
  •  రాయాల్సినవన్నీ పూర్తయ్యాకే ఐచ్ఛిక (ఛాయిస్‌) ప్రశ్నలు రాయడానికి ప్రయత్నించాలి.
  •  కొట్టివేతలు, దిద్దివేతలు ఉండరాదు. బ్రాకెట్‌లో ఒకటి రాసి, మళ్లీ కొట్టివేసి బయట రాయటం మంచిది కాదు.
  •  సాధ్యమైనంత వరకు 10-15 నిమిషాలు ముందే పరీక్ష రాయటం పూర్తిచేయాలి.
  •  రాసిన జవాబులు, ప్రశ్నల నంబర్లను మరోసారి పరిశీలించుకోవాలి.

ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయండి… విజయాన్ని సాధించండి. అభినందనలతో


– ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌,
యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, సెల్‌ : 9490762412

13 March 2024


 

22 January 2024


                      https://prajasakti.com/.../implementation-of-ops-is-the.../
ఓపిఎస్‌ అమలుతోనే పరిష్కారం
జిపిఎస్‌ చట్టంలోని అంశాలను పరిశీలిస్తే దీని పేరు మాత్రమే గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం తప్ప ఇందులో ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌కు మాత్రం ఎటువంటి గ్యారంటీ లేదన్నది అవగతమవుతుంది. పెన్షన్‌ ఎక్కడ నుంచి, ఎంత, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా తెలియని గందరగోళాన్ని ఈ జిపిఎస్‌ చట్టం సృష్టించింది.
వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తానని అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి గద్దెనెక్కి అయిదేళ్ళవుతున్నా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదు. పైగా వైసిపి ప్రభుత్వం జిపిఎస్‌ (గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం) పేరుతో చట్టాన్ని తెచ్చింది. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులలో మాత్రం ఓపిఎస్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌ అలాగే ఉంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓపిఎస్‌, సిపిఎస్‌ ఇక ముగిసిన అధ్యాయాలని, మిగిలింది జిపిఎస్‌ మాత్రమేనని చెప్పేశారు. కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిపిఎస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, ఓపిఎస్‌ అమలు మాత్రమే సరైన పరిష్కారమని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తూనే ఉన్నారు. నేటికీ వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా తన నిర్ణయంతో ముందుకు పోవడమే కాక, ఉద్యోగుల వ్యతిరేకతను నిర్బంధంతో అణచివేయాలని చూస్తోంది. ఇటువంటి వైఖరి సమస్యను పరిష్కరించదు సరికదా మరింత జఠిలం చేస్తుంది.
ఈ నేపథ్యంలో చట్టంలో పేర్కొన్న అంశాలను, వాటి మధ్య ఉండే వైరుధ్యాలను పరిశీలించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ తీసుకొచ్చామన్నది కూడా సరైనది కాదు. ఎందువల్లనంటే చట్టంలో పేర్కొన్నట్లు సిపిఎస్‌ ను అలాగే ఉంచి, దానికి జగన్‌ ప్రభుత్వం జిపిఎస్‌ (గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం) పేరుతో ఒక చట్టాన్ని చేసింది. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని బేఖాతరు చేస్తూ ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం లోని సెక్షన్‌ 5(4) ప్రకారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని సిపిఎస్‌ కు చెల్లిస్తున్న ఉద్యోగుల వాటాలో ఏ మాత్రం మార్పు ఉండదని పేర్కొన్నారు. సెక్షన్‌ 6(2) ప్రకారం జిపిఎస్‌ లో పెన్షన్‌ అంటే సిపిఎస్‌ ద్వారా వచ్చే పెన్షన్‌ తోపాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే టాప్‌ అని పేర్కొన్నారు. సిపిఎస్‌ ద్వారా వచ్చే పెన్షన్‌ సొమ్ము ఎంతో తేలిన తర్వాత దానికీ, ఉద్యోగి ఆఖరి జీతంలో 50 శాతానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ టాప్‌ అమౌంట్‌ ద్వారా భర్తీ చేస్తుంది. దీనినిబట్టి స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే సిపిఎస్‌ యథాతథంగా అలాగే కొనసాగి, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం టాప్‌ అప్‌ ద్వారా అదనపు సొమ్ము చెల్లిస్తుంది! ఇదీ, మొత్తంగా జిపిఎస్‌ సారాంశం. ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం టాప్‌అప్‌ ద్వారా అదనంగా చెల్లించే గ్యారెంటీడ్‌ పెన్షన్లో పెన్షన్‌ భాగానికి కావలసిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది జిపిఎస్‌ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. కానీ అంతర్భాగంగా ఉన్న ఫైనాన్షియల్‌ మెమొరాండంలో 2010 నాటికల్లా రూ.2500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని మాత్రం పేర్కొన్నారు. ఈ లెక్కలు ఎంతవరకు సరైనవి, ఏ రకంగా ఈ అంచనాకు వచ్చారు? అనేది చెప్పగలిగే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ఇక్కడే పేర్కొన్న మరో అంశం ఏమిటంటే ఆర్థిక భారం మార్కెట్లో వస్తున్న మార్పులు, సిపిఎస్‌ లోని కార్పస్‌ ఫండ్‌ మీద వచ్చే ఆదాయం, ఉద్యోగుల జీతాల పెరుగుదల, ఉద్యోగుల రిటైర్మెంట్లు వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
అస్థిరమైన ఇన్ని అంశాల మీద ఆధారపడే ఆర్థిక భారాన్ని ముందే ఎలా అంచనా వేశారో పేర్కొనకపోవడం, ఆ నిధులను ఎలా సమకూరుస్తారో తెలపకపోవడం, ఈ చట్టంలో పెద్ద వైరుధ్యమే. జిపిఎస్‌ కు టాప్‌అప్‌ పెన్షన్‌ అమౌంట్‌ ఎలా, ఎంత అనేవి నిర్ణయించడానికి వేరే నిబంధనలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగి రిటైర్మెంట్‌ సమయంలో అప్పటి సిపిఎస్‌ నిధులను యాన్యుటీల నిమిత్తం ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో కూడా ప్రభుత్వం రూపొందించే నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సెక్షన్‌ 6(1)లో పేర్కొన్నారు. అసలు షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టడమే నష్టం అనుకుంటే, తాను చెప్పిన దగ్గరే పెట్టాలనడం ఇంకా అన్యాయం. అలాగే సెక్షన్‌ 6(4) ప్రకారం రిటైర్మెంట్‌ సందర్భంగా సిపిఎస్‌ ఫండ్‌ నుంచి ఏదైనా మొత్తాన్ని ఉద్యోగి ఉపసంహరించుకుంటే ఆ మేరకు గ్యారంటీ పెన్షన్‌ కూడా తగ్గుతుందని, దానికి తగ్గట్టుగా నిబంధనలు రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనర్థమేమిటంటే-అవకాశం ఉన్నా, ఉద్యోగి తనకు కావలసిన మొత్తాన్ని తీసుకోకూడదన్నమాట. సెక్షన్‌ 6(5) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా టాప్‌అప్‌ మొత్తంగా కానీ, కొంత భాగం కానీ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఇటువంటి ఎన్నో షరతులు, నిబంధనలతో కూడుకున్న ఇది ఏ రకంగానూ ఓపిఎస్‌ కు ప్రత్యామ్నాయం కాదు అనేది స్పష్టం. ఈ జిపిఎస్‌ వల్ల ఉద్యోగులకు ఏమీ ప్రయోజనం లేకపోవడం అన్నది ఒక అంశం కాగా, దీనికి కేంద్రం చట్టబద్ధత ఏమైనా ఉందా అన్నది రెండో అంశం. రాష్ట్రంలో నేడు అమలులో ఉన్న సిపిఎస్‌ కేంద్ర ప్రభుత్వం 2004లో రూపొందించిన ఎస్‌పిఎస్‌ లో అంతర్భాగం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు ఒకటి 2004 నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ స్కీంలో చేరుతున్నట్లుగా పిఎస్‌ఆర్‌డిఏ చట్టం సెక్షన్‌ 2(4)కు అనుగుణంగా నిర్ణయించింది. దీని అర్థం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి ఇప్పుడు మన రాష్ట్రంలో సిపిఎస్‌ అమల్లో ఉంది. కానీ నేడు ఆ సిపిఎస్‌ ను అలాగే ఉంచుతూ జిపిఎస్‌ అమలు చేస్తానంటోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేసిందా అన్నది ప్రశ్న. జిపిఎస్‌ చట్టంలోని అంశాలను పరిశీలిస్తే దీని పేరు మాత్రమే గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం తప్ప ఇందులో ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌కు మాత్రం ఎటువంటి గ్యారంటీ లేదన్నది అవగతమవుతుంది. పెన్షన్‌ ఎక్కడ నుంచి, ఎంత, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా తెలియని గందరగోళాన్ని ఈ జిపిఎస్‌ చట్టం సృష్టించింది. పైగా సిపిఎస్‌ ను పూర్తిగా రద్దు చేసి, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు రూపొందించిన ఓపిఎస్‌ పునరుద్ధరణ లాగా కాకుండా, ఆ సిపిఎస్‌ ను అలాగే ఉంచుతూ దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వాటాగా ఉంది. అలాంటపుడు ఇది గ్యారంటీ పెన్షన్‌ స్కీం అవుతుందో, గారడీ పెన్షన్‌ స్కీం అవుతుందో మనకు తేలికగానే అర్ధం అవుతుంది. ఉద్యోగుల పొదుపు సొమ్ము అయిన పి.ఎఫ్‌ సొమ్మును వారికి కూడా తెలియకుండా ఉపయోగించుకొని, చట్టబద్ధంగా, హక్కుగా రావలసిన ఐదేళ్ళ కరువు భత్యాన్ని ఎగ్గొట్టి పిఆర్‌సి పెంపుగా చూపిన ప్రభుత్వం ఈ టాప్‌ అప్‌ పెన్షన్‌ ను మాత్రం సక్రమంగా ఇస్తుందని నమ్మేదెలా? రాష్ట్ర ప్రభుత్వం, తాను ఇచ్చిన హామీని అమలు చేయలేక పోవడం అనే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి జిపిఎస్‌ అనే పేరుతో అసలు సమస్యను మసిపూసి మారేడుకాయ చేస్తోంది. గత అయిదేళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంత నష్టపోయారో, సమాజంలో ప్రభుత్వం వల్ల ఎంత పలుచన అయిపోయారో ఒకసారి పరిశీలిస్తే, ఉద్యోగ ఉపాధ్యాయల పట్ల, వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో సులభంగానే అర్ధం అవుతుంది. అందుకే రాష్ట్రం గత ఆరు నెలలుగా ఉద్యమాల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది.
రాబోయే ఎన్నికలలో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ఎవరైతే పూర్తి స్థాయి హామీ ఇస్తారో వారికి మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ మద్దతు ఉంటుందని, ఉత్తుత్తి హామీలు కాకుండా అమలు చేసే చిత్తశుద్ధి ఉన్న వారివైపు ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. పాత పెన్షన్‌ సాధనే ఉద్యోగ ఉపాధ్యాయుల ఎజెండాగా ఉండాలని, ఈ ఎన్నికల నేపథ్యంలో పాత పెన్షన్‌ అమలు అనేది ఒక రాజకీయ ఎజెండాగా ఉండేట్లు పోరాటాన్ని విస్తృతం చేయాలి. పాత పెన్షన్‌ సాధించుకోవాలి.
/ వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, సెల్‌: 94907 62412 /ఎస్‌.పి.మనోహర్‌ కుమార్

09 January 2024






 

06 January 2024




                                          POEM OF A DOG

I'm the one who's always waiting for you.
Your car has a special sound that I have imprinted on my senses, I can recognize it in a thousand.
Your steps have a magic bell.
Your voice is music to my ears.
If I see your joy,
it makes me happy!.
Your scent is the best.
Your presence moves my senses.
Your waking up wakes me up
I contemplate you sleeping and for me you are my God,
I am happy watching your sleep.
Your look is a ray of light.
Your hands upon me,
hold the lightness of peace and the sublime display of infinite love.
When you leave,
I feel a huge void in my heart.
I keep waiting for you again and again.
I am the one who will wait for you all your life today,
tomorrow and forever:
I am your dog.
All

25 December 2023

                 




                                          మొదటి క్రిస్మస్‌ రోజు


రెండు వేల సంవత్సరాల క్రితం ఆ మొదటి క్రిస్మస్‌ రోజు

ఆ రోజు....

పొడిబారిన ఆ భూమిలో క్రిస్మస్‌ సందర్భంగా మంచు కురవని సందర్భం.

గడ్డకట్టే మంచు తుఫానులకు బదులుగా,....

మనిషి కూరుకుపోయే ఇసుకలు....

ఒక స్థిరమైన మరియు అసాధారణమైన నక్షత్రం...

దానిని అనుసరించిన ముగ్గురు తెలివైన వ్యక్తులు....

నిశ్శబ్దంగా ఉన్న కొండలపై నిద్రపోతుండగా...,

ఒక గొర్రెల కాపరి కేకలు వేసాడు.

నిశ్శబ్ద నక్షత్రాల ఆకాశంలో దేవదూతల గుంపును చూశాడు.

అనంతరం మేరీ చేతుల్లో సురక్షితంగా ఉన్న శిశువును చూశారు.

రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన మొదటి క్రిస్మస్‌ రోజు అది 

ఆశ్చర్యంగా నిలబడింది నేటికి.....

22 October 2023


 నేను పోయినప్పుడు

వస్త్రానికి బదులు
ఓ కాగితాన్ని కప్పండి
కవిత రాసుకుంటాను

సిరాబుడ్డినీ, పెన్నునొకదాన్ని
పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
మనసులో ముల్లు గుచ్చుకున్నప్పటి పాటో
గాయపడిన గజలో
గుండెలోయలనుండి జాలువారొచ్చు
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను

పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా!
దండలతో మూసెయ్యకండి
నాకు ఎలర్జీ!!
ఆ రేకులతో ఏదార్నైనా
మెత్తగా పరవండి

పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని  
పేర్లు పెట్టకండి
నచ్చదు
సామాన్లేవీ పారేయొద్దు అడిగినవాళ్లకిచ్చేయండి

బ్యాండ్ వాళ్ళను
ఓల్డ్ మెలొడీస్ వాయించమనండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
టైమంటే టైమే!

మంగళవారమో! అమంగళవారమో!!
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
బడికి కబురు పెట్టండి
నే బతికిన క్షణాలు తలుచుని
వాళ్లు సెలవిచ్చుకుంటారు

దింపుడుకళ్లం దగ్గర
చెవులు గిల్లుమనేలా పిలవకండి
తలుచుకునేవారెవరో నాకు తెలుసు

డబ్బుకు ఇబ్బందక్కరలేదు
పక్కవాళ్ల కొట్లో ఖాతాఉంది
పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి!

మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు..
పురుగూ పుట్రా భయం!
కాస్త చూసి తగలబెట్టండే...
చుట్టుపక్కల మొక్కలుంటాయేమో!

గంధపుచెక్కలతో కాలడం కంటే
జ్ఞాపకమై పరిమళించడమే ఎక్కువ నాకు

పనిలో పని!
నా నవ్వులూ కన్నీళ్ళు ఆవిరైపోతున్న కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉన్నట్టుంటుంది
తనివితీరా విన్నట్టుంటుంది

08 October 2023


             గీతాంజలి- 27

వెలుగు? ఎక్కడున్నదీ వెలుగు?
తీవ్రమైన కోరికతో ఆ జ్యోతిని వెలుగించు...
దీపం ఉన్నది కానీ ఎప్పుడూ అది వెలిగింపలేదు.
వెలుగు లేని హృదయమా... !
ఇంతకంటే చనిపోవడమే నయం కదా!
దయనీయస్థితి నా హృదయతలుపు తడుతోంది.
నా ప్రభువు నాకోసం వేచియున్నారన్న సంకేతాన్ని ఇస్తోంది
ఆ రాత్రి చీకటిలో నీ ప్రేమ పిలుపు వినిపిస్తుంది.
రాత్రి ఆకాశం మేఘాలతో ఆవృతమైంది.
వర్షం విరామంలేకుండా కురుస్తోంది.
నాలో ఏదో కదలిక
దాని అర్థమేమిటో తెలికుంది.
ఒక్క క్షణం మెరుపు అంతలోనే చిమ్మచీకటి
దూరంగా ఎక్కడ పలికే ఆ గానం
వినిపించే చోటికి వెళ్ళే మార్గం కోసం
నా హృదయం ఆర్తిగా వెదుకుతుంది.
వెలుగు? ఎక్కడున్నదీ వెలుగు?
తీవ్రమైన కోరికతో ఆ జ్యోతిని వెలుగించు...
ఉరుములు, మెరుపులు, ఆశూన్యంలోకి గాలి వేగంగా వీస్తుంది.
రాత్రి చీకటిగా ఉంది. రాళ్ళు నల్లగా ఉన్నాయి.
ఆ చీకటిలో గంటలు వేగంగా గడిచిపోతున్నాయి.
ఆ ప్రేమ జ్యోతిని నీ జీవితంతో వెలిగించు...
అనువాదం
- ఎస్.పి.మనోహర్ కుమార్
Light, oh where is the light ? Kindle
it with the burning fire of desire !
There is the lamp but never a flicker
of a flame, is such thy fate, my heart !
Ah, death were better by far for thee !
Misery knocks at thy door, and her
message is that thy lord is wakeful, and
he calls thee to the love-tryst through
the darkness of night.
The sky is overcast with clouds and
the rain is ceaseless. I know not what
this is that stirs in me, I know not its
meaning.
A moment’s flash of lightning drags
down a deeper gloom on my sight, and
my heart gropes for the path to where
the music of the night calls me.
Light, oh where is the light I Kindle
it with the burning fire of desire It
thunders and the wind rushes screaming
through the void. The night is black
as a black stone. Let not the hours
pass by in the dark. Kindle the lamp
of love with thy life.
-Rabindranath Tagore

25 September 2023


 

21 September 2023


 

06 September 2023



 గాయాలు చేయకు

ఈ దట్టమైన అడవిలో
వెదురుగానే నన్ను ఉండిపోనీ
అడవి చెట్ల మీద
కోయిల పాటలు నన్ను ఆస్వాదించనీ
నిరంతరం వీచే
చిరుగాలి స్పర్శతో
పరవశించి పాడుకోవాలని ఉంది.
వేణువుగా మలచొద్దు
పాటలసలే వద్దు
చప్పట్లు నా మౌనాన్ని
భగ్నం చేస్తాయి.
నా శరీరానికి గాయాలు చేసి
ఆ గాయాలలో నీ ఊపిరి ఊది
నా ఊపిరి తీయకు.
` ఎస్‌.పి.మనోహర్‌ కుమార్

05 September 2023


 ఉపాధ్యాయుని తోనే ఉత్తమ బోధనభ్యసన

పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లు వద్దని యునెస్కో రిపోర్టు సూచిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌ లోని పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లను తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయులకు బదులుగా సాంకేతికతను ఉపయోగించడం సరైనది కాదు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, నాణ్యమైన ఉపాధ్యాయ వర్గాన్ని అందించడం ద్వారా బోధనాభ్యసన మెరుగుపడాలి. సాంకేతిక పరికరాలు ఉపాధ్యాయులకు సహాయకారిగా మాత్రమే ఉండాలనే యునెస్కో సూచనలను పరిగణన లోకి తీసుకుని భవిష్యత్‌ విద్యారంగ ప్రణాళికలు రూపొందించాలి.

            విద్యారంగంలో సాంకేతికత కోవిడ్‌ కాలంలో విస్తృతంగా ఉపయోగించబడింది. ఆ సమయంలో విద్యారంగం దెబ్బతినకుండా డిజిటల్‌ విధానం ఆదుకుంది. కానీ ఆధునిక సాంకేతికత అందుబాటులో లేక కోట్లాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రపంచవాప్తంగా పరిస్థితులు మెరుగుపడ్డాక కూడా సాంకేతికతను ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో 14 దేశాలలో చదువులపై సాంకేతిక రంగ ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో ఇటీవల 'గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌-2023'ను విడుదల చేసింది. ఈ సందర్భంగా యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రే అజూలే స్పందిస్తూ- ఏ సాంకేతిక సాధనం కూడా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదు. విద్యార్థుల అభ్యసనానికి సాంకేతిక సాధనాలు అదనపు వనరులుగా మాత్రమే ఉండాలి. అది విద్యాభ్యసన మెరుగుదలకు ఉపయోగపడేలా ఉండాలి. నేటి తరం విద్యార్థికి సాంకేతికత లేకపోయినప్పటికీ జీవించడమెలాగో నేర్పించాలి-అని కోరారు. ఈ అధ్యయనంలో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్‌ విద్యా ప్రణాళికలను ప్రకటించాలని ప్రపంచ దేశాలలోని విద్యారంగ నిపుణులు, విద్యా ప్రణాళికా రచయితలను కోరారు.
               స్మార్ట్‌ఫోన్ల ద్వారా విద్యాబోధన వలన లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. విద్యార్థి కేంద్రంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలి. డిజిటల్‌ పరికరాల అతి వినియోగం వలన విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుని అతిగా స్పందించడం పెరిగింది. డేటా సురక్షితం కాకపోవడంతో సైబర్‌ నేరాలు పెరిగాయి. విద్యార్థులలో ఏకాగ్రత, స్థిరంగా ఆలోచించే తత్వం దెబ్బ తింటుంది. విద్యార్థులలో డిజిటల్‌ అసమానతలు పెరిగిపోతున్నాయి. డిజిటల్‌ విద్యా వనరులు అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. 31 శాతం మందికి కనీసం డిజిటల్‌ విద్య అందుబాటులో లేదు. విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య ఉండాల్సిన కనీస కమ్యూనికేషన్‌ కూడా దిగజారిపోతుంది. దీనిని నిలువరించని పక్షంలో భవిష్యత్తులో అతిగా సాంకేతికతను ఉపయోగించే విద్యార్థి, సృజనాత్మక ఆలోచనలు కోల్పోయి, నిత్య జీవితంలో యాంత్రికంగా మారిపోయే దుస్థితి ఉంది...అంటూ యునెస్కో నివేదిక పలు హెచ్చరికలు కూడా చేసింది.
             యునెస్కో నివేదిక కొన్ని సిఫార్సులను సైతం చేసింది- ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకునే సందర్భంలో వాణిజ్య ప్రయోజనాలతో పాటు సామాజిక లాభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. స్వల్పకాలిక ప్రయోజనాల కంటే, దీర్ఘకాలిక నష్టాలను లెక్కవేయాలి. డిజిటల్‌ విధానాన్ని ఉపయోగించే సందర్భంలో విద్యార్థుల, ఉపాధ్యాయల వ్యక్తిగత డేటా గోప్యత, భద్రతకు చట్టాలు చేయాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా జాగ్రత్త పడాలి. విద్యారంగంలో సాంకేతికతను విద్యార్థుల అభ్యసన మెరుగుపడేందుకు ఉపయోగించాలి. ఉపాధ్యాయులకు డిజిటల్‌ సాంకేతికత సహకారిగా మాత్రమే ఉండాలి. ఉపాధ్యాయలకు ప్రత్యామ్నాయంగా మారకుండా జాగ్రత్తపడాలి. తరగతిలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించివేయాలని సూచించింది.
 

                                                                    బోధనలో సాంకేతిక సరైనదేనా ?

డిజిటల్‌ విద్యా విధానం వలన చదువులు మెరుగు పడ్డాయని చెప్పడానికి నేటికీ బలమైన అధ్యయనం లేదు. విద్యార్థులలో ఆలోచనాశక్తిని కట్టడి చేసే విధానంగా సాంకేతికత నిలుస్తుంది. సృజనాత్మకతను కోల్పోయేట్టు చేస్తుంది. లెర్నింగ్‌ బై డూయింగ్‌కు ఇది పూర్తి విరుద్ధం.
 

                                                                అందరికీ సమానంగా అందుతుందా ?

డిజిటల్‌ సాంకేతిక పరికరాలు అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. పైగా ఇవి ప్రతి 36 నెలలకు అప్‌గ్రేడ్‌ కావడమో లేదా కొత్తవి రావడమో జరుగుతుంది. ఈ క్రమంలో డిజిటల్‌ విద్య కొందరికే అందుబాటులో ఉంటున్న సంగతి కోవిడ్‌-19 కాలంలో మన అనుభవంలోకి వచ్చిందే.
 

                                                డిజిటల్‌ విద్యా విధానంలో బోధనాభ్యసనాన్ని కొలవగలమా ?

సాంకేతిక రంగంలో అభ్యాస ప్రక్రియ (లెర్నింగ్‌ ప్రాసెస్‌) ఒకవైపు నుంచే ఉంటుంది. రెండవ వైపు స్థబ్దుగా ఉండటం వలన లెర్నింగ్‌ ప్రాసెస్‌ను సాంకేతిక పరంగానే అంచనా వేయగలం. అంతేగానీ పూర్తి స్థాయి అంచనా వేయలేం. నాణ్యతను అంచనా వేయలేం.
 

                                                                   సుదీర్ఘకాలం నిలబడగలిగేనా ?

విద్యా రంగంలో సాంకేతికతను ఉపయోగించడం వలన విద్యాభ్యసనం సుదీర్ఘకాలం నిలబడుతుందని చెప్పగలిగే అధ్యయనాలు నేటికీ అందుబాటులో లేవు. సాంకేతికతో వ్యక్తిగత వెసులుబాటు బాగున్నా సామాజికంగా అది కలిగించే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని విద్యావిధాన నిర్ణయాలు తీసుకోవాలని యునెస్కో నివేదిక ప్రపంచ దేశాలకు సూచించింది. గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌-2023 సూచనలను తక్షణమే అమలు చేయడానికి ఫ్రాన్స్‌, ఫిన్లాండ్‌, నెదర్లాండ్స్‌ దేశాలు అంగీకరించడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. చైనాలో ఇప్పటికే బోధనలో సాంకేతికతను 30 శాతం మించకుండా కట్టడి చేయడం జరిగింది. మిగిలిన ప్రపంచ దేశాలు ఆ దిశగా ముందడుగు వేస్తాయని ఆశిద్దాం. ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా విద్యారంగంలో సాంకేతికత బోధన మెరుగుదలకు మాత్రమే ఉపయోగపడాలి. దీనితోపాటు ఆన్‌లైన్‌ విద్య అనేది బోధనలో అభ్యసనలో అదనపు వనరుగా వుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలుగా విద్యారంగంలో సాంకేతికతకు పెద్ద పీట వేయడం చూస్తున్నాం. దీనికంటే రెండు సంవత్సరాల ముందు నుంచే యాప్‌ల పేరుతో నిరంతరం పాఠశాల, ఉపాధ్యాయుల, విద్యార్థుల సమాచార సేకరణ జరుగుతున్నది. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు, విద్యార్థుల మార్కుల నమోదు చేయాల్సి వుంటోంది. ఇవిగాక పాఠశాలలో టాయిలెట్లు, గుడ్డు, చిక్కీ, బియ్యం వంటి నిరంతర రోజువారీ అంశాలను ఉపాధ్యాయులే నమోదు చేయాల్సి వస్తున్నది. వీటివలన ప్రాథమిక పాఠశాలల్లో విలువైన బోధనా సమయాన్ని కోల్పోతున్నాం.
             మూడవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు టోఫెల్‌ ప్రోగ్రామ్‌, అదే విధంగా ఐఎఫ్‌పి (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌)ను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అమలుకు తెచ్చారు. దేశం మొత్తం మీద పాఠశాలల్లో 25,000 ఐఎఫ్‌పిలు వాడుకలో వున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లోనే 15,694 పాఠశాలల్లోని 30,230 క్లాస్‌రూములకు ఐఎఫ్‌పిలను అందించారు. అదే విధంగా 3, 4, 5 తరగతులకు స్మార్ట్‌ టీవీలు అందించారు. ఎ.పి ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడం జరిగింది.
ఈ ఐఎఫ్‌పిల వినియోగానికి సంబంధించి రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి జులై మొదటి వారంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఐఎఫ్‌పిలకు బైజూస్‌ కంటెంట్‌ను జోడించి విద్యార్ధులకు పాఠ్యాంశాలను బోధించాలని శిక్షణా సమయంలో చెప్పారు. తరగతి గదిలో ఐఎఫ్‌పిల ద్వారా బోధన వల్ల ఉపాధ్యాయులు పాసివ్‌గా ఉండేే పరిస్థితి ఏర్పడుతుంది. రోజులో ఎక్కువ భాగం ఐఎఫ్‌పిలను విద్యార్ధి చూడటం వలన మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్‌ క్రమేపీ తరుగుతుంది. దీనికి తోడు కొంతమంది ఉపాధ్యాయులు టెక్నాలజీ సమర్ధవంతంగా ఉపయోగించలేక పోవచ్చు. విద్యార్థులు అతిగా స్క్రీన్‌లను చూడటం వలన కంటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది.
            గత అయిదు సంవత్సరాలుగా ఒక డిఎస్‌సి నోటిఫికేషన్‌ వేయలేదు. పైగా ప్రభుత్వం జీవో 117 ద్వారా పాఠశాలల విలీనం చేసింది. దీనివలన రాష్ట్రంలోని 3 జిల్లాలలో తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా వున్నట్టు కన్పించసాగాయి. నాణ్యమైన ఉపాధ్యాయుల నియామకం చేయకుండా ఉన్నత పాఠశాలల్లో టిపిఆర్‌ను పెంచి ఉపాధ్యాయులపై తీవ్రమైన భారం పెంచడం, పర్యవేక్షణలతో ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం విద్యా రంగానికి మంచిది కాదు.
             పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లు వద్దని యునెస్కో రిపోర్టు సూచిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌ లోని పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లను తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయులకు బదులుగా సాంకేతికతను ఉపయోగించడం సరైనది కాదు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, నాణ్యమైన ఉపాధ్యాయ వర్గాన్ని అందించడం ద్వారా బోధనాభ్యసన మెరుగుపడాలి. సాంకేతిక పరికరాలు ఉపాధ్యాయులకు సహాయకారిగా మాత్రమే ఉండాలనే యునెస్కో సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్‌ విద్యారంగ ప్రణాళికలు రూపొందించాలి.

/ వ్యాసకర్త ˜యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి,
సెల్‌ : 9490762412 /
ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌