About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

22 January 2024


                      https://prajasakti.com/.../implementation-of-ops-is-the.../
ఓపిఎస్‌ అమలుతోనే పరిష్కారం
జిపిఎస్‌ చట్టంలోని అంశాలను పరిశీలిస్తే దీని పేరు మాత్రమే గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం తప్ప ఇందులో ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌కు మాత్రం ఎటువంటి గ్యారంటీ లేదన్నది అవగతమవుతుంది. పెన్షన్‌ ఎక్కడ నుంచి, ఎంత, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా తెలియని గందరగోళాన్ని ఈ జిపిఎస్‌ చట్టం సృష్టించింది.
వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తానని అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి గద్దెనెక్కి అయిదేళ్ళవుతున్నా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదు. పైగా వైసిపి ప్రభుత్వం జిపిఎస్‌ (గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం) పేరుతో చట్టాన్ని తెచ్చింది. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులలో మాత్రం ఓపిఎస్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌ అలాగే ఉంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓపిఎస్‌, సిపిఎస్‌ ఇక ముగిసిన అధ్యాయాలని, మిగిలింది జిపిఎస్‌ మాత్రమేనని చెప్పేశారు. కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిపిఎస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, ఓపిఎస్‌ అమలు మాత్రమే సరైన పరిష్కారమని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తూనే ఉన్నారు. నేటికీ వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా తన నిర్ణయంతో ముందుకు పోవడమే కాక, ఉద్యోగుల వ్యతిరేకతను నిర్బంధంతో అణచివేయాలని చూస్తోంది. ఇటువంటి వైఖరి సమస్యను పరిష్కరించదు సరికదా మరింత జఠిలం చేస్తుంది.
ఈ నేపథ్యంలో చట్టంలో పేర్కొన్న అంశాలను, వాటి మధ్య ఉండే వైరుధ్యాలను పరిశీలించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ తీసుకొచ్చామన్నది కూడా సరైనది కాదు. ఎందువల్లనంటే చట్టంలో పేర్కొన్నట్లు సిపిఎస్‌ ను అలాగే ఉంచి, దానికి జగన్‌ ప్రభుత్వం జిపిఎస్‌ (గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం) పేరుతో ఒక చట్టాన్ని చేసింది. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని బేఖాతరు చేస్తూ ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం లోని సెక్షన్‌ 5(4) ప్రకారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని సిపిఎస్‌ కు చెల్లిస్తున్న ఉద్యోగుల వాటాలో ఏ మాత్రం మార్పు ఉండదని పేర్కొన్నారు. సెక్షన్‌ 6(2) ప్రకారం జిపిఎస్‌ లో పెన్షన్‌ అంటే సిపిఎస్‌ ద్వారా వచ్చే పెన్షన్‌ తోపాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే టాప్‌ అని పేర్కొన్నారు. సిపిఎస్‌ ద్వారా వచ్చే పెన్షన్‌ సొమ్ము ఎంతో తేలిన తర్వాత దానికీ, ఉద్యోగి ఆఖరి జీతంలో 50 శాతానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ టాప్‌ అమౌంట్‌ ద్వారా భర్తీ చేస్తుంది. దీనినిబట్టి స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే సిపిఎస్‌ యథాతథంగా అలాగే కొనసాగి, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం టాప్‌ అప్‌ ద్వారా అదనపు సొమ్ము చెల్లిస్తుంది! ఇదీ, మొత్తంగా జిపిఎస్‌ సారాంశం. ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం టాప్‌అప్‌ ద్వారా అదనంగా చెల్లించే గ్యారెంటీడ్‌ పెన్షన్లో పెన్షన్‌ భాగానికి కావలసిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది జిపిఎస్‌ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. కానీ అంతర్భాగంగా ఉన్న ఫైనాన్షియల్‌ మెమొరాండంలో 2010 నాటికల్లా రూ.2500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని మాత్రం పేర్కొన్నారు. ఈ లెక్కలు ఎంతవరకు సరైనవి, ఏ రకంగా ఈ అంచనాకు వచ్చారు? అనేది చెప్పగలిగే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. ఇక్కడే పేర్కొన్న మరో అంశం ఏమిటంటే ఆర్థిక భారం మార్కెట్లో వస్తున్న మార్పులు, సిపిఎస్‌ లోని కార్పస్‌ ఫండ్‌ మీద వచ్చే ఆదాయం, ఉద్యోగుల జీతాల పెరుగుదల, ఉద్యోగుల రిటైర్మెంట్లు వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
అస్థిరమైన ఇన్ని అంశాల మీద ఆధారపడే ఆర్థిక భారాన్ని ముందే ఎలా అంచనా వేశారో పేర్కొనకపోవడం, ఆ నిధులను ఎలా సమకూరుస్తారో తెలపకపోవడం, ఈ చట్టంలో పెద్ద వైరుధ్యమే. జిపిఎస్‌ కు టాప్‌అప్‌ పెన్షన్‌ అమౌంట్‌ ఎలా, ఎంత అనేవి నిర్ణయించడానికి వేరే నిబంధనలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగి రిటైర్మెంట్‌ సమయంలో అప్పటి సిపిఎస్‌ నిధులను యాన్యుటీల నిమిత్తం ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో కూడా ప్రభుత్వం రూపొందించే నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సెక్షన్‌ 6(1)లో పేర్కొన్నారు. అసలు షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టడమే నష్టం అనుకుంటే, తాను చెప్పిన దగ్గరే పెట్టాలనడం ఇంకా అన్యాయం. అలాగే సెక్షన్‌ 6(4) ప్రకారం రిటైర్మెంట్‌ సందర్భంగా సిపిఎస్‌ ఫండ్‌ నుంచి ఏదైనా మొత్తాన్ని ఉద్యోగి ఉపసంహరించుకుంటే ఆ మేరకు గ్యారంటీ పెన్షన్‌ కూడా తగ్గుతుందని, దానికి తగ్గట్టుగా నిబంధనలు రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనర్థమేమిటంటే-అవకాశం ఉన్నా, ఉద్యోగి తనకు కావలసిన మొత్తాన్ని తీసుకోకూడదన్నమాట. సెక్షన్‌ 6(5) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా టాప్‌అప్‌ మొత్తంగా కానీ, కొంత భాగం కానీ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఇటువంటి ఎన్నో షరతులు, నిబంధనలతో కూడుకున్న ఇది ఏ రకంగానూ ఓపిఎస్‌ కు ప్రత్యామ్నాయం కాదు అనేది స్పష్టం. ఈ జిపిఎస్‌ వల్ల ఉద్యోగులకు ఏమీ ప్రయోజనం లేకపోవడం అన్నది ఒక అంశం కాగా, దీనికి కేంద్రం చట్టబద్ధత ఏమైనా ఉందా అన్నది రెండో అంశం. రాష్ట్రంలో నేడు అమలులో ఉన్న సిపిఎస్‌ కేంద్ర ప్రభుత్వం 2004లో రూపొందించిన ఎస్‌పిఎస్‌ లో అంతర్భాగం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు ఒకటి 2004 నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ స్కీంలో చేరుతున్నట్లుగా పిఎస్‌ఆర్‌డిఏ చట్టం సెక్షన్‌ 2(4)కు అనుగుణంగా నిర్ణయించింది. దీని అర్థం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి ఇప్పుడు మన రాష్ట్రంలో సిపిఎస్‌ అమల్లో ఉంది. కానీ నేడు ఆ సిపిఎస్‌ ను అలాగే ఉంచుతూ జిపిఎస్‌ అమలు చేస్తానంటోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేసిందా అన్నది ప్రశ్న. జిపిఎస్‌ చట్టంలోని అంశాలను పరిశీలిస్తే దీని పేరు మాత్రమే గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం తప్ప ఇందులో ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌కు మాత్రం ఎటువంటి గ్యారంటీ లేదన్నది అవగతమవుతుంది. పెన్షన్‌ ఎక్కడ నుంచి, ఎంత, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా తెలియని గందరగోళాన్ని ఈ జిపిఎస్‌ చట్టం సృష్టించింది. పైగా సిపిఎస్‌ ను పూర్తిగా రద్దు చేసి, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు రూపొందించిన ఓపిఎస్‌ పునరుద్ధరణ లాగా కాకుండా, ఆ సిపిఎస్‌ ను అలాగే ఉంచుతూ దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వాటాగా ఉంది. అలాంటపుడు ఇది గ్యారంటీ పెన్షన్‌ స్కీం అవుతుందో, గారడీ పెన్షన్‌ స్కీం అవుతుందో మనకు తేలికగానే అర్ధం అవుతుంది. ఉద్యోగుల పొదుపు సొమ్ము అయిన పి.ఎఫ్‌ సొమ్మును వారికి కూడా తెలియకుండా ఉపయోగించుకొని, చట్టబద్ధంగా, హక్కుగా రావలసిన ఐదేళ్ళ కరువు భత్యాన్ని ఎగ్గొట్టి పిఆర్‌సి పెంపుగా చూపిన ప్రభుత్వం ఈ టాప్‌ అప్‌ పెన్షన్‌ ను మాత్రం సక్రమంగా ఇస్తుందని నమ్మేదెలా? రాష్ట్ర ప్రభుత్వం, తాను ఇచ్చిన హామీని అమలు చేయలేక పోవడం అనే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి జిపిఎస్‌ అనే పేరుతో అసలు సమస్యను మసిపూసి మారేడుకాయ చేస్తోంది. గత అయిదేళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంత నష్టపోయారో, సమాజంలో ప్రభుత్వం వల్ల ఎంత పలుచన అయిపోయారో ఒకసారి పరిశీలిస్తే, ఉద్యోగ ఉపాధ్యాయల పట్ల, వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో సులభంగానే అర్ధం అవుతుంది. అందుకే రాష్ట్రం గత ఆరు నెలలుగా ఉద్యమాల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది.
రాబోయే ఎన్నికలలో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ఎవరైతే పూర్తి స్థాయి హామీ ఇస్తారో వారికి మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ మద్దతు ఉంటుందని, ఉత్తుత్తి హామీలు కాకుండా అమలు చేసే చిత్తశుద్ధి ఉన్న వారివైపు ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. పాత పెన్షన్‌ సాధనే ఉద్యోగ ఉపాధ్యాయుల ఎజెండాగా ఉండాలని, ఈ ఎన్నికల నేపథ్యంలో పాత పెన్షన్‌ అమలు అనేది ఒక రాజకీయ ఎజెండాగా ఉండేట్లు పోరాటాన్ని విస్తృతం చేయాలి. పాత పెన్షన్‌ సాధించుకోవాలి.
/ వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, సెల్‌: 94907 62412 /ఎస్‌.పి.మనోహర్‌ కుమార్