About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

09 September 2021


                           ప్రత్యక్ష బోధనా విధానం ద్వారానే విద్యలో నాణ్యత పెరుగుతుంది. చదువంటే పాఠ్యాంశాలు మాత్రమే కాదు. విద్యార్ధి సర్వతోముఖాభివృద్ధి ఉపాధ్యాయ, విద్యార్ధి ప్రత్యక్ష సంబంధం ద్వారానే సాధ్యం. 'నో టీచర్‌- నో ఎడ్యుకేషన్‌', 'శిక్షక్‌ నహీ - శిక్షా నహీ', ఉపాధ్యాయుడుంటేనే - చదువు' అన్న నినాదాలు ఉపాధ్యాయుని ప్రాధాన్యతను తెలియజెప్పడంతోబాటు వారిపై ఉన్న గురుతర బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాయి.

     దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుందన్న డా.డి.ఎస్‌. కొఠారి మాటలు అక్షర సత్యాలు. విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి, మానవతా విలువలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో బోధనా విధానం కీలకం. కోవిడ్‌ మహమ్మారి వ్యాపించిన పరిస్థితులలో విద్యను అందించడానికి ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం ఉన్నదా అనే చర్చ గత సంవత్సరకాలంగా జరుగుతుంది. ఏ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ప్రత్యక్ష బోధనకు అది ఏ విధంగాను ప్రత్యామ్నాయం కాబోదు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులను వెలిగించే గురువులకు సమాజంలో గౌరవ ప్రదమైన స్థానం ఉంది.
     'దేశాన్ని తీర్చిదిద్దే మేధావులు ఉపాధ్యాయులే' అని చాటి చెప్పిన డాక్టర్‌ రాధాకృష్ణన్‌ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా వ్యవహరించారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు 1888 సెప్టెంబర్‌ 5న ఆయన జన్మించారు. అతిసాధారణ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి ఓ జమిందారు వద్ద చిన్న ఉద్యోగం. తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్‌లో 1893లో ప్రాధమిక విద్యనభ్యసించారు. ఆయనకు చదువంటే ప్రాణం. పేదకుటుంబం కావడం వలన విద్యాభ్యాసం అంతా ఉపకారవేతనాలపైనే కొనసాగింది. ప్రాథమిక విద్య ముగియగానే తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్‌ ఎవాంజెలికల్‌ లూథóరన్‌ మిషన్‌ స్కూల్‌లో చేరారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 21 ఏళ్లకే మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో వేదాంత శాఖలో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా చేరారు. ఆ సమయంలోనే ఆయన భారతీయ తత్త్వశాస్త్రాలపై అనేక రచనలు చేశారు. అవి ఎందరినో ప్రభావితం చేశాయి. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయంవారు తమ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నియమించారు. విద్యార్థులు ఆయన బోధనను ఎంతో శ్రద్ధతో వినేవారట. తర్వాత రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ కోరిక మేరకు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేపట్టాలని నిశ్చయించుకున్నారు. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన విద్యార్థులు రైల్వేస్టేషన్‌ దాకా రాధాకృష్ణన్‌ను జట్కా బండిపై ఎక్కించుకొని స్వయంగా బండిని లాక్కొని వెళ్ళిన సంఘటన విద్యార్థులకు తమ గురువు రాధాకృష్ణన్‌పై గల ప్రేమ , గౌరవాన్ని తెలియజేస్తుంది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉన్నప్పుడు 'భారతీయ తత్వశాస్త్రం' అనే గ్రంథాన్ని రచించాడు. ఇది అనేకమంది విదేశీ పండితుల ప్రశంసలు పొందింది. '' మీరు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీనుంచి డిగ్రీ తీసుకుంటే మీకు మరింత గొప్ప పేరొచ్చేది'' అని ఒక మిత్రుడు అన్నాడట. దానికి ఆయన స్పందిస్తూ, '' నేను ఆక్షఫర్డ్‌ కు వెళితే అధ్యాపకుడిగానే వెళతాను, విద్యార్థిగా వెళ్లను'' అని చెప్పారు. అలా అన్న ఆరేళ్ల తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటి వారి ఆహ్వానంపై తత్వ శాస్త్రం పై ఉపన్యాసాలిచ్చేందుకు లండన్‌ వెళ్ళారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, అమెరికా దేశాలలో ఉపన్యాసాలిచ్చి మాతృదేశానికి పేరుతెచ్చారు.
డా||సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆంధ్రాయూనివర్సిటి వైస్‌ఛాన్సలర్‌ గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య కోరిక మేరకు బనారస్‌ హిందూ యూనివర్సిటి ఛాన్సలర్‌గా 1948 సంవత్సరం జనవరి వరకూ పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డా|| సర్వేపల్లి యునెస్కో ప్రతినిధిగా 1952 వరకూ పనిచేశారు. 1952లో భారతదేశ ప్రథóమ ఉప రాష్ట్రపతిగా, తర్వాత దేశ రెండవ రాష్ట్రపతిగా 1962 నుంచి 1967 వరకూ పనిచేసి మంచి రాజనీతిజ్ఞుడిగా పేరుపొందారు.
     1962 సంవత్సరంలో కొందరు మిత్రులు డా|| సర్వేపల్లి పుట్టినరోజు జరపడానికి ఆయన దగ్గరకు వచ్చిపుడు ఆయన దానిని సున్నితంగా తిరస్కరిస్తూ ' నా పుట్టిన రోజు వేరుగా జరిపే బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే నేను ఎంతో గర్విస్తానని' చెప్పి ఉపాధ్యాయ వృత్తిపట్ల తన ప్రేమను చాటారు. ఆయన కోరిక ప్రకారమే 1962 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 5వ తేదీన సర్వేపల్లి జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా భారతదేశంలో ఉపాధ్యాయదినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 'గురుపూజోత్సవం' పేరుతో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం సంప్రదాయంగా మారింది.
       భారతీయ తత్వ శాస్త్రాన్ని ఆంగ్లంలో విదేశాలకు పరిచయం చేసిన గొప్పవ్యక్తి డా|| సర్వేపల్లి. పుస్తకాలు కొనే ఖర్చు భరించలేక, ఉచితంగా లభించిన పుస్తకాలకు అనువుగా డిగ్రీలో తత్వ శాస్త్రాన్ని ఎంచుకొన్న ఆయన, అందులోనే అంతర్జాతీయ ఖ్యాతి పొందే రచనలు చేశారు. కేవలం 20ఏళ్ల వయసులో ఎమ్మే డిగ్రీకోసం ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసం '' ది ఎథిక్స్‌ ఆఫ్‌ ద వేదాంత అండ్‌ ఇట్స్‌ మెటా ఫిజికల్‌ ప్రిపోజిషన్స్‌'' పుస్తకంగా వెలువడింది. మైసూరు విశ్వవిద్యాలయంలో ఉండగా తొలిపుస్తకం 'ద ఫిలాసఫీ ఆఫ్‌ రవీంద్రనాధ్‌ ఠాగూర్‌' రాశారు. దేశీయ , అంతర్జాతీయ పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాశారు. ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి భారతీయ వేదాంత, తత్వ గ్రంథాల సారాంశాన్ని ఆంగ్లంలో పరిచయం చేస్తూ రచనలు చేశారు. ఆయన రాసిన ' ద రీజిన్‌ ఆఫ్‌ రెలీజియన్‌ ఇన్‌ కాంటెంపరరీ ఫిలాసఫీ', ' యాన్‌ ఐడియలిస్టిక్‌ వ్యూ ఆఫ్‌ లైఫ్‌', ది ఫిలాసఫీ ఆఫ్‌ ఉపనిషద్స్‌', ' ఈస్ట్రన్‌ రెలీజియన్‌ అండ్‌ వెస్ట్రన్‌ థాట్స్‌' , ' ద దమ్మపద', ' రికవరీ ఆఫ్‌ ఫెయిత్‌' పుస్తకాలు అంతర్జాతీయంగా పేరొందాయి.
      మనదేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' తో సహా ప్రతిష్టాత్మకమైన 'నైట్‌హుడ్‌', 'ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌', ' జర్మన్‌ పీస్‌ప్రైజ్‌', 'టెంపుల్‌టన్‌ ప్రైజ్‌' వంటి అవార్డులు ఎన్నో అందుకున్నారు. బహుమతిగా వచ్చే సొమ్మును సైతం విద్యావ్యాప్తికే అందించడం విశేషం. అలా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటిలో డా|| సర్వేపల్లి పేరిట ఉపకారవేతనాన్ని ఇప్పటికీ ఇస్తున్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తనకు లభించే వేతనంలో కేవలం రూ.2500/- మాత్రమే తీసుకొని మిగిలిన సొమ్మును ప్రధాని విపత్తు నిధికి విరాళమిచ్చేవారు. డా||కె.ఎం.మున్షీ తో కలిసి 'భారతీయ విద్యాభవన్‌' ను స్థాపించారు. మానవ జీవితంలో మంచిని పెంచాలని, ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లో మమతానురాగాలను పెంచే దిశగా ప్రపంచం కృషిచేయాలన్నారు. అహింసా విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రపంచ దేశాలలో శాంతిని పెంచవచ్చన్నారు.ప్రపంచ దేశాలలో ప్రసిద్ధిచెందిన 152 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించడం విశేషం.
     రాజ్యసభ అధ్యక్షుడిగా డా|| సర్వేపల్లి సభను నిర్వహించిన తీరు రాజకీయనాయకుల మన్ననలు పొందింది. సభామర్యాదలకు గానీ, అధ్యక్షస్థాన గౌరవాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా సభ్యుల కోపతాపాలకు, ఆవేశపూరిత ప్రవర్తనలకు అవకాశం కల్పించకుండా , హాస్యపు చెణుకులతో మృదువైన మందలింపులతో సభాకార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది 'పార్లమెంటేరియన్ల' ప్రశంసలందుకున్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శించడంలో వెనుకాడలేదు. అవినీతిని, దేశ వనరుల దుర్వినియోగపరచడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 1967 లో పదవీవిరమణచేసి శేషజీవితాన్ని మద్రాస్‌లో గడిపారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 17 ఏప్రిల్‌ 1975న కన్నుమూశారు.
    విద్యా, వైజ్ఞానిక, తత్వ శాస్త్రాల్లో అపారమైన పాండిత్యం కలిగిన మహోపాధ్యాయుడు డాక్టర్‌ సర్వేపల్లికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్శంగా నివాళులర్పిస్తున్నాం.
    డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పినట్లు జాతిని తీర్చిదిద్దే శిల్పులు ఉపాధ్యాయులు. సమాజంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాలి. ఉపాధ్యాయుడంటే ఉత్త పాఠం చెప్పేవాడుకాదు. మార్పునకు అతడొక ప్రయోగశాల. ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయని వేసే ప్రతి అడుగు, ప్రతి చర్యను సమాజం జాగ్రత్తగా గమనిస్తుంది. ఆధిపత్య భావజాల సంస్కృతి పెచ్చుమీరిన ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే బడుగు బలహీన వర్గాల పిల్లలకు సమాజం పట్ల కచ్చితమైన అభిప్రాయాలు ఉండేట్లు బోధన సాగాలి. మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితులను గమనించి ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకితభావం అలవర్చుకోవాలి. ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించాలి.వృత్తి మీద ప్రేమంటే పిల్లల మీద, తరగతి గదిమీద, పాఠశాల మీద అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలమీద ప్రేమ ఉండాలి.బెత్తం పట్టుకోవడమంటే ఉపాధ్యాయునిగా తన వైఫల్యాన్ని అంగీకరించినట్టే. ఆర్థిక ,సామాజిక అసమానత పొరలతో నిండినట్టి ఈ సమాజంలో చదువు వెలుగులు నింపాలి.
     ప్రత్యక్ష బోధనా విధానం ద్వారానే విద్యలో నాణ్యత పెరుగుతుంది. చదువంటే పాఠ్యాంశాలు మాత్రమే కాదు. విద్యార్ధి సర్వతోముఖాభివృద్ధి ఉపాధ్యాయ, విద్యార్ధి ప్రత్యక్ష సంబంధం ద్వారానే సాధ్యం. 'నో టీచర్‌- నో ఎడ్యుకేషన్‌', 'శిక్షక్‌ నహీ - శిక్షా నహీ', ఉపాధ్యాయుడుంటేనే - చదువు' అన్న నినాదాలు ఉపాధ్యాయుని ప్రాధాన్యతను తెలియజెప్పడంతోబాటు వారిపై ఉన్న గురుతర బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాయి.
 

రచయిత : యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి
ఎస్‌.పి మనోహర్‌ కుమార్‌