About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

04 September 2013

సులభశైలి ఆయన సొత్తు
'ప్రపంచాన్ని ప్రస్తుతం పట్టి పీడిస్తున్న భీకర సమస్యల్ని గురించి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కంటే ఎక్కువగా తెలిసిన వారెవ్వరూ లేరు' - చర్చిల్‌
'ఆయన మాట్లాడుతుంటే గాయపడిన మానవ హృదయం తన ఆరాటాన్ని వెళ్ళబోసుకుంటున్నట్లు ఉంది.' -స్టాలిన్‌
తత్వవేత్తల ప్రపంచం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? అని శోధించి, నిర్ధారించి నిర్వచిస్తారు. విద్యావేత్త ప్రపంచాన్ని తెలియజేస్తాడు. దానికి అనుగుణంగా మలుస్తాడు. తత్వవేత్తది సిద్ధాంతం. విద్యావేత్తది ఆచరణ. విద్యకు తత్వశాస్త్రం పునాది. తత్వశాస్త్రానికి విద్య కొనసాగింపు. అందువల్లే ప్రపంచంలోని ప్రముఖ తత్వవేత్తలందరూ విద్యావేత్తలు. సోక్రటీసు అన్ని కాలాల్లోనూ ఆరాధించాల్సిన విద్యావేత్త, ఉపాధ్యాయులు. ఆయన శిష్యుడు ప్లాటో ఒక విద్యా పథకాన్నే రచించాడు. అరిస్టాటిల్‌ నుంచి రవీంద్రుని దాకా నాగార్జునుడి నుంచి గాంధీజీ దాకా ఆ కోవలోని వారే.
రాధాకృష్ణన్‌ది కూడా ఇదే వారసత్వం. ఇదే ఆదర్శం. అక్కడితో ఆగక ఆయన ఆధునిక సామాజిక రంగాల్లో అనితర సాధ్యమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. ప్రపంచంలోని ఏ తత్వవేత్తా రాధాకృష్ణన్‌ పని చేసినన్ని రంగాల్లో పని చేసి ఉండరు.
తత్వవేత్తగా ఆయన పలు సిద్ధాంతాల సమన్వయకర్త. 'సహనమే సంస్కృతి' అన్నది ఆయన సిద్ధాంతం. అసహనానికి, మాఢ్యానికి పాక్షిక దృష్టికి, పిడివాదానికి ఆయన వ్యతిరేకి. ఈ వ్యతిరేకతను ఆయన తాత్విక దృష్టిలో సమర్థిస్తారు. విశ్వంలో కనిపించే అన్ని రూపాలకూ ప్రయోజనం కల్పించి వాటికి ఉచిత స్థానం ఇవ్వగలిగినప్పుడే ఏ తత్వశాస్త్రానికైనా విలువ ఏర్పడుతుంది. మానవుల మనస్సుల్లో స్థావరం ఏర్పడుతుంది. దాన్ని ప్రతిభావంతంగా నిర్వర్తించడమే తత్వవ్తేతగా రాధాకృష్ణన్‌ గొప్పదనం.
విద్యావేత్తగా దాదాపు 40 సంవత్సరాలు పలు విద్యాలయాల్లో బోధన చేశారు. మద్రాసు నుంచి ఆక్స్‌ఫర్డ్‌ దాకా, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి యునెస్కో దాకా ఆయన ఎక్కడ పని చేసినా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు బోధించేవారని ప్రతీతి. రాధాకృష్ణన్‌ అత్యంత క్లిష్టమైన అంశాన్ని కూడా సరళాతి సరళంగా చెప్పేవారట. భావ గాంభీర్యత కోల్పోవలసి వచ్చినా సరే అర్థం కావడం బోధనకు ప్రామాణికం, పరమార్థం అని ఆయన నమ్మేవారు.
ఎన్ని పురస్కారాలు లభించినా, ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని గ్రంథాలు రాసినా, ఆయన్ను హిమాలయం అంత ఎత్తుగా నిలబెట్టింది ఆయన విశ్వజనీన సహన సంస్కృతి, ఆయన స్వచ్ఛత, సౌశీల్యత. సరిగ్గా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సింది ఈ లక్షణాలే.
                                                                                                                   -ఎస్‌పి మనోహర్‌కుమార్‌ 
(ఉపాద్యాయ దినోత్సవం 05-09-2013 న ప్రజాశక్తి లో ప్రచురింపబడిన వ్యాసం)